Amit Shah: అమిత్ షా హెలికాప్టర్ లో తనిఖీలు నిర్వహించిన ఎన్నికల అధికారులు
- మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు
- హింగోలీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన అమిత్ షా
- హెలికాప్టర్ లో ఉన్న బ్యాగులు, సూట్ కేసులు సోదా అధికారులు
- ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరిస్తామన్న అమిత్ షా
మహారాష్ట్రలో నవంబరు 20న ఎన్నికలు జరగనుండగా, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. అమిత్ షా ఇవాళ హింగోలీ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లారు.
అయితే, హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన ఎన్నికల అధికారులు అమిత్ షా ఉపయోగిస్తున్న హెలికాప్టర్ లో నిశితంగా సోదాలు చేశారు. హెలికాప్టర్ లో ఉన్న బ్యాగులను, సూట్ కేసులను, ఇతర సరంజామాను సోదా చేశారు. ఈసీ నియమావళిని అనుసరించి ఈ తనిఖీ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా వెల్లడించారు.
ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగాలని బీజేపీ కోరుకుంటుందని, ఎన్నికల సంఘం నియమావళి పట్ల తమకు గౌరవం ఉందని అమిత్ షా తెలిపారు. భారత్ ను ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిపేందుకు ఎన్నికల వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.