Team India: దక్షిణాఫ్రికాపై రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన భారత్

Team India registered a cakewalk 135 run win over South Africa in the 4th T20I

  • 4వ టీ20లో ఏకంగా 135 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై టీమిండియా ఘనవిజయం
  • 284 పరుగుల లక్ష్య ఛేదనలో 148 పరుగులకే ఆలౌట్ అయిన ఆతిథ్య జట్టు
  • సమష్టిగా రాణించిన భారత బౌలర్లు
  • సెంచరీలతో సత్తా చాటిన సంజూ శాంసన్, తిలక్ వర్మ

బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలు.. బౌలింగ్‌లో బౌలర్లు అందరూ సమష్టిగా రాణించడంతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. 284 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రికార్డు స్థాయిలో 135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆరంభంలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా టాపార్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసి తమవంతు సహకారం అందించారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్క్ 1, రీజా హెండ్రిక్స్ 0, ఐడెన్ మార్క్రమ్ 8, ట్రిస్టన్ స్టబ్స్ 43, డేవిడ్ మిల్లర్ 36, మార్కో యన్‌సెన్ 29 (నాటౌట్), అండిలే సిమాలనె 25, కోయెట్జీ 12, కేశవ్ మహారాజ్‌ 6, సిపామ్లా 3 చొప్పున పరుగులు చేశారు.

ఇక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి రికార్డు స్థాయిలో 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్, యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశారు. శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు, తిలక్ 47 బంతుల్లో 120 పరుగులు బాది ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్ అభిషేక్ వర్మ 18 బంతుల్లో 36 పరుగులు సాధించి ఔటయ్యాడు. వీరు ముగ్గురు కలిసి పరుగుల వరద పారించారు. సిక్సర్ల సునామీ సృష్టించారు.
 
ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయాయి. టీ20ల్లో దక్షిణాఫ్రికాపై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. మరోవైపు ఈ ఏడాది భారత్‌కు ఇదే చివరి టీ20 మ్యాచ్‌. ఈ సంవత్సరం మొత్తం 26 మ్యాచ్‌లు ఆడగా అందులో 24 విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.


  • Loading...

More Telugu News