Sanju Samson: సెంచరీతో చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ఈ రికార్డు సాధించిన ఏకైక క్రికెటర్‌‌గా అవతరణ‌

Sanju Samson became first player ever to score three T20I centuries in a calendar year

  • టీ20 క్రికెట్‌లో ఒకే ఏడాది 3 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సంజూ
  • దక్షిణాఫ్రికాపై 2, బంగ్లాదేశ్‌పై ఒక శతకం నమోదు చేసిన స్టార్ బ్యాటర్
  • జోహన్నె‌స్‌బర్గ్ టీ20లో సెంచరీతో ప్రపంప రికార్డు నెలకొల్పిన సంజూ శాంసన్

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఏకంగా 283 పరుగులు సాధించింది. ఈ భారీ స్కోర్ నమోదు చేయడంలో ఓపెనర్ సంజూ శాంసన్, తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో ఇద్దరికీ ఇవి రెండవ సెంచరీలు కావడం గమనార్హం.

జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సెంచరీతో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా అవతరించాడు. ఇదే సిరీస్‌లో తొలి టీ20లో సంజూ సెంచరీ నమోదు చేశారు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా సంజూ శతకం నమోదు చేశాడు. దీంతో ఈ ఏడాది మూడు సెంచరీలు నమోదు చేసినట్టు అయింది.

కాగా జోహన్నెస్‌బర్గ్ టీ20లో సంజూ శాంసన్ కేవలం 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ అతడి ఫామ్‌పై ప్రభావం చూపలేదు. మరో సెంచరీ హీరో తిలక్ వర్మతో కలిసి రెండవ వికెట్‌కు ఏకంగా 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండవ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదయింది.

  • Loading...

More Telugu News