Train: పట్టాలపై పరుగులకు ఇక బ్రేక్.. రెస్టారెంట్ గా మారనున్న రైలు!
- లోయర్ పారెల్ స్టేషన్ ఆవరణలో రెస్టారెంట్ ఏర్పాటు
- యాభై ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రైలుకు ఇక విశ్రాంతి
- ముంబై- వల్సాద్ ల మధ్య ప్రయాణికులకు సేవలు
ముంబై- వల్సాద్ ల మధ్య ఆ రైలు దాదాపు యాభై ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలందించింది. ఎంతోమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఈ చారిత్రక రైలుకు వచ్చే నెల నుంచి విశ్రాంతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పట్టాలపై పరుగులకు బ్రేక్ వేసి ఈ రైలు కోచ్ లలో ఒకదానిని హోటల్ గా మార్చాలని భావిస్తున్నారు. లోయర్ పారెల్ స్టేషన్ ఆవరణలో డబుల్ డెక్కర్ కోచ్ ల ను హోటల్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ముంబై, సూరత్ వల్సాద్ రైల్వే రూట్ ప్రారంభమైన కొత్తలో.. 1975-76 ప్రాంతంలో ట్రైన్ నెంబర్ 09023/24 ప్యాసింజర్ రైలు ముంబై, వల్సాద్ ల మధ్య పరుగులు పెట్టేది. ఇప్పటికీ ఈ ప్యాసింజర్ రైలు తిరుగుతోంది. దాదాపు 50 ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలందించిన ఈ రైలు వచ్చే నెల నుంచి విశ్రాంతి తీసుకోనుంది. ఈ రైలులోని నాన్ ఏసీ డబుల్ డెక్కర్ కోచ్ లను రెస్టారెంట్ గా మార్చాలని అధికారులు నిర్ణయించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.