Dhruva Sarja: రూ.120 కోట్లు పెడితే వచ్చింది రూ.25 కోట్లా...?
- ధ్రువ సర్జా హీరోగా రూపొందిన 'మార్టిన్'
- అక్టోబర్ 11న థియేటర్లకు వచ్చిన సినిమా
- రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టుగా టాక్
- ఈ నెల 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
కన్నడ స్టార్ హీరోలలో ధ్రువ సర్జా ఒకరు. 2012లోనే ఆయన తన కెరియర్ ను మొదలెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను... పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'పొగరు' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన 'మార్టిన్' సినిమా చేశాడు. ఏపీ అర్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
ధ్రువ సర్జా ఎవరో కాదు, యాక్షన్ కింగ్ అర్జున్ కి మేనల్లుడు. అర్జున్ కి కథ... స్క్రీన్ ప్లే - దర్శకత్వ విభాగాలపై మంచి పట్టు ఉంది. అందువలన ఆయన తన మేనల్లుడి కోసం ఒక మంచి కథను రెడీ చేసి ఇచ్చాడు. ఆ కథతో రూపొందిన సినిమానే ఇది. టీజర్... ట్రైలర్ తో ఈ సినిమా ఒక్కసారిగా హైప్ తెచ్చుకుంది. అందరూ కూడా 'కేజీఎఫ్' తో పోలుస్తూ మాట్లాడుకున్నారు.
అలాంటి ఈ సినిమా దసరా సందర్భంలో అక్టోబర్ 11వ తేదీన విడుదలైంది. రూ.120 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ భాషలన్నిటిలో కలుపుకుని ఈ సినిమా రూ.25 కోట్లను మాత్రమే వసూలు చేసిందని టాక్. వైభవి శాండిల్య కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.