Boeing: బోయింగ్ లో సమ్మె ఎఫెక్ట్.. 438 మందికి ఉద్వాసన
- అమెరికా విమాన తయారీ సంస్థలో లేఆఫ్స్
- ఉద్యోగులకు పింక్ స్లిప్పులు పంచిన కంపెనీ
- సియాటెల్ ప్రాంతంలో 33 వేల మంది కార్మికుల సమ్మె
ఉద్యోగులు, కార్మికుల సమ్మెతో వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన పలుకుతోంది. ఏకంగా 438 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు అందజేసింది. ఇందులో 218 మంది ఇంజనీర్లే కావడం గమనార్హం. కంపెనీలోని టెక్నికల్ యూనిట్‌కు చెందిన పలువురు సాంకేతిక నిపుణులనూ తొలగిస్తోంది. ఇందులో అర్హత కలిగిన ఉద్యోగులకు మూడు నెలల వరకు వివిధ ప్రయోజనాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
అమెరికాలోని సియాటెల్ ఏరియాలో ఉన్న బోయింగ్ కంపెనీలో సుమారు 33 వేల మంది కార్మికులు వారాల కొద్దీ సమ్మె చేశారు. దీంతో 737 మాక్స్, 767, 777 జెట్‌ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ సమ్మె వల్ల బోయింగ్ కంపెనీకి ఏకంగా 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దీనిని పూడ్చుకోవడానికి ఉద్యోగులను ఇంటికి పంపించడమే మార్గమని కంపెనీ నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతానికి 438 మంది ఉద్యోగం కోల్పోయారు. రాబోయే రోజుల్లో మరింతమందిని ఇంటికి పంపించేందుకు బోయింగ్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సంస్థ సిబ్బందిలో సుమారు 10 శాతం సిబ్బందిని తొలగిస్తామని బోయింగ్ ఇదివరకే ప్రకటించింది.