VG Venkata Reddy: గనులశాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్.. దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశం

Ex director of mines and geology VG Venkata Reddy got bail
  • వైసీపీ హయాంలో గనుల శాఖలో అక్రమాలకు పాల్పడినట్టు వెంకటరెడ్డిపై అభియోగాలు
  • ఎవరి ప్రమేయమూ లేకుండా రూ. 160 కోట్లు మళ్లించారని ఏసీబీ సీఐయూ నిర్ధారణ
  • శుక్రవారం బెయిల్.. శనివారం గుట్టుచప్పుడు కాకుండా విడుదల
  • బెయిలు సందర్భంగా కోర్టు పలు ఆంక్షలు
వైసీపీ హయాంలో మైనింగ్‌ శాఖలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి శుక్రవారం బెయిలు లభించడంతో శనివారం ఆయన  జైలు నుంచి విడుదలయ్యారు. ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఆయన విడుదల మీడియాకు సైతం తెలియకుండా నిశ్శబ్దంగా జరిగిపోవడం చర్చనీయాంశమైంది.

గనుల శాఖకు చెందిన రూ. 160 కోట్లను ఎవరి ప్రమేయమూ లేకుండా దారి మళ్లించారని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) నిర్ధారించి సెప్టెంబర్ 11న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసింది. అదే నెల 26న రాత్రి హైదరాబాద్‌లో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం 50 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. 

శుక్రవారం ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి హిమబిందు వెంకటరెడ్డికి బెయిలు మంజూరు చేశారు. రూ. 50 వేల పూచీకత్తు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా కోర్టు ఆంక్షలు విధించింది. ప్రస్తుత, పూర్వ చిరునామాను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఏసీబీ సీఐయూ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. 
VG Venkata Reddy
Andhra Pradesh
Mines
ACB Court
Bail

More Telugu News