Narendra Modi: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం

PM Narendra Modi arrived in Brazil to attend the 19th G20 Summit

  • జీ20 సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి
  • రియో డి జెనీరో వేదికగా నేడు, రేపు శిఖరాగ్ర సదస్సు
  • జీ20 దేశాల అధినేతలో చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డి జెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘనస్వాగతం పలికింది. నగరంలో నేడు, రేపు (సోమ, మంగళ) జరగనున్న 19వ జీ20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సభ్య దేశాల నాయకులతో మోదీ చర్చలు జరపనున్నారు. కీలకమైన ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో పాటు పలువురు ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.

బ్రెజిల్ చేరుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో అడుగు పెట్టానని అన్నారు. సదస్సులో వివిధ ప్రపంచ నాయకులతో ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. విమానాశ్రయంలో తనకు లభించిన స్వాగతానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు.

కాగా మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా సందర్శన అనంతరం ప్రధాని మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయ సమూహంతో కూడా ఆయన మాట్లాడారు. కాగా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News