Kapill Dev: ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలపై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాల నిర్ణయమే ముఖ్యమన్న కపిల్ దేవ్
- తమలాంటి వ్యక్తుల అభిప్రాయాలతో పనిలేదని వ్యాఖ్య
- ఛాంపియన్స్ ట్రోఫీ ‘టూర్’ మ్యాచ్‌లను పీవోకేలో షెడ్యూల్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ భారత్ - పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలను మరింత అగాథంలోకి నెడుతోంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీకి భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ వైఖరి నచ్చని పాకిస్థాన్.. భారత్‌ను రెచ్చగొట్టేలా ‘ట్రోఫీ టూర్’ను పీవోకేలోని (పాక్ ఆక్రమిత కశ్మీర్) పలు వేదికల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ షెడ్యూల్‌ను ఐసీసీ నిలుపుదల చేసింది. పీవోకేలోని వేదికలు లేకుండా కొత్త టూర్ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశాలపై కపిల్ దేవ్ తన ఆలోచనలను పంచుకున్నారు. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపించడం లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇలాంటి విషయాల్లో మాలాంటి వారి అభిప్రాయాల అవసరం లేదు. మా అభిప్రాయాలను పట్టించుకోకూడదు. కపిల్ దేవ్ ఎవరికన్నా పెద్దవాడు కాకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రచారం కోసం ‘ట్రోఫీ టూర్’ను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.