America Company: మీటింగ్ కు రాలేదని 99 మంది ఉద్యోగులను తొలగించిన సీఈవో
- అమెరికాలో ఓ కంపెనీ సీఈవో నిర్వాకం
- గత నెల 13న ఘటన
- తాత్కాలిక ఉద్యోగి పెట్టిన పోస్టుతో వెలుగులోకి
అమెరికాలోని ఓ కంపెనీ బాస్ తన ఉద్యోగులలో 90 శాతం మందిని ఇంటికి సాగనంపాడు. తాను ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఈవో.. ఏకంగా 99 మందికి ఊస్టింగ్ ఆర్డర్ పంపించాడు. కంపెనీలో పనిచేస్తున్నదే 110 మంది కాగా అందులో 99 మందిని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గత నెల 13న చోటుచేసుకోగా.. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ తాత్కాలిక ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో బాల్డ్విన్ అక్టోబర్ 13న తన ఉద్యోగులతో మీటింగ్ నిర్వహించాడు. దీనిపై కంపెనీలోని మొత్తం 110 మంది ఉద్యోగులకు సమాచారం అందించాడు. అయితే, మీటింగ్ కు కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాల్డ్విన్.. మీటింగ్ కు రానివాళ్లందరినీ ఉద్యోగంలో నుంచి తీసేశాడు.
ఉద్యోగులకు ఓ సందేశం పంపిస్తూ.. ఈ రోజు ఉదయం మీటింగ్ కు హాజరు కాని వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానంటూ అధికారికంగా ప్రకటించాడు. మీటింగ్ కు రాని 99 మంది ఉద్యోగులు వెంటనే తమ దగ్గర ఉన్న కంపెనీ వస్తువులను అప్పగించి, అన్ని అకౌంట్ల నుంచి లాగౌట్ కావాలని చెప్పాడు. ఆ తర్వాత క్షణం కూడా ఆఫీసులో ఉండకూడదని, వారంతా బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు. సీఈవో బాల్డ్విన్ పెట్టిన ఈ మెసేజ్ ను ఓ తాత్కాలిక ఉద్యోగి స్క్రీన్ షాట్ తీసి రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో సదరు కంపెనీ బాస్ తీరు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.