EPFO: పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా?... ఇలా చెయ్యండి చాలు
- వ్యక్తిగత అవసరాలకు పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం
- యూఏఎన్ పోర్టల్‌పై ఆన్లైన్ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్
- పీఎఫ్ నగదు విత్‌డ్రాకు సంబంధించిన ప్రక్రియ అనుసరిస్తే చాలా సులభం
రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ కోసమే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే అనివార్య పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఉద్యోగులు తమ ఖాతా నుంచి కొంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్న వ్యక్తులు మాత్రమే రిటైర్మెంట్ కు ముందే పీఎఫ్ ఖాతాలోని పూర్తి డబ్బుని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
కాగా వైద్య అవసరాలు, తన పెళ్లి లేదా పిల్లల వివాహం, హోమ్ లోన్ చెల్లింపు, ఇల్లు కొనుగోలు, ఇంటి పునర్నిర్మాణం వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆ ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం..
ఆన్లైన్లో పాక్షిక ఉపసంహరణ ప్రక్రియ ఇలా...
యూఏఎన్ (UAN) పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఖాతాదారుడు తన యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓటీపీ ధృవీకరణ తర్వాత ఖాతాదారుడి పీఎఫ్ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది.
ప్రొఫైల్ పేజీ కుడి ఎగువ భాగంలో ‘ఆన్లైన్ సర్వీసెస్’పై క్లిక్ చేయాలి. కింద స్క్రోల్ డౌన్ ఆప్షన్లలో ‘క్లెయిమ్’పై క్లిక్ చేయాలి. అనంతరం ఈపీఎఫ్‌వోకి అనుసంధానించిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసి వివరాలను ధృవీకరించుకోవాలి. అనంతరం.. క్లెయిమ్ చేసిన నగదు మొత్తం ఈపీఎఫ్‌వో ద్వారా సూచించిన బ్యాంక్ ఖాతాలో జమవుతుందని తెలియజేసే ‘సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్’ అందుతుంది. నిబంధనలు, షరతుల దగ్గర ‘యస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ‘ఆన్లైన్ క్లెయిమ్’పై క్లిక్ చేసి మరిన్ని వివరాలను ఎంటర్ చేయాలి. ఖాతాదారుడు అడ్రస్‌తో పాటు స్కాన్ చేసిన చెక్కులు, ఫామ్15జీ వంటి కొన్ని పత్రాలను కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ కోసం క్లెయిమ్ చేయవచ్చు.