Rajaiah: కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు

Tatikonda Rajaiah fires at Kadiyam Srihari

  • కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు
  • దళితబంధులో రాజయ్య మోసాలకు పాల్పడ్డారని కడియం ఆరోపణ
  • నిరూపించాలని తాటికొండ రాజయ్య సవాల్

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ధర్మసాగర్ మండలం దేవునూరి గుట్టల్లో అటవీ, రైతుల భూములను కడియం ఆక్రమించారని రాజయ్య ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను సాక్ష్యాలతో నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని కడియం సవాల్ చేశారు.

అదే సమయంలో, దళితబంధులో తాటికొండ రాజయ్య మోసాలను మీడియా ముందు నిరూపిస్తానని కడియం శ్రీహరి అన్నారు. తాను నిరూపిస్తే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. అక్రమాలు, అన్యాయాలపై చర్చకు రావాలని, ఆ తర్వాత మనిద్దరిలో ఎవరో ఒకరు స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో ఉండాలని కడియం అన్నారు.

కడియం సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న రాజయ్య

కడియం శ్రీహరి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని రాజయ్య ఈరోజు తెలిపారు. కడియం స్థానికేతరుడని, ఆయన పర్వతగిరి నుంచి ఇక్కడకు వచ్చాడని, కాబట్టి ఆయనను అక్కడకు పంపించే వరకు తాను నిద్రపోనన్నారు. తాను వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ కడియం శ్రీహరి అసలు ప్రజానాయకుడే కాదన్నారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు.

తాను స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలోనే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే తనను బొందపెడతారని, కానీ కడియం శ్రీహరిని ఎవరూ స్థానికుడిగా గుర్తించరన్నారు. ఆయనను ప్రజలు తప్పకుండా తరిమి కొడతారన్నారు. తాను నీతిమంతుడినని కడియం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయనో అవినీతి తిమింగలమని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కడియం శ్రీహరి రూ.100 కోట్లు ఖర్చు చేశారని తాటికొండ రాజయ్య ఆరోపించారు.

  • Loading...

More Telugu News