KTR: తెలంగాణలో నిజాం రాజ్యాంగం అమలవుతోంది: కేటీఆర్ ఆగ్రహం
- ప్రశ్నిస్తే సంకెళ్లు... నిలదీస్తే అరెస్టులు అంటూ కేటీఆర్ ఆగ్రహం
- విచారణకు రమ్మని పిలిచి అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్న
- అక్రమ అరెస్ట్‌లతో ఎన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని నిలదీత
తెలంగాణలో నియంతలు రాజ్యమేలుతున్నారని, నిజాం రాజ్యాంగం అమలవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "ప్రశ్నిస్తే సంకెళ్లు... నిలదీస్తే అరెస్టులు... నియంత రాజ్యమిది... నిజాం రాజ్యాంగమిది" అంటూ రాసుకొచ్చారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఎన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్య ప్రేమికులం... ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
నీ అక్రమ అరెస్టులకో... నీ ఉడత బెదిరింపులకో భయపడేది లేదు, ఈ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ అంతకుముందు మరో ట్వీట్ చేశారు. మిస్టర్ రాహుల్ గాంధీ అంటూ ఆయనను ఉద్దేశించి ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు. మీ ద్వంద్వ వైఖరి కలవరపెడుతోందని, అసలు మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ-అదానీ కలిస్తే స్కాం అయితే... రేవంత్-అదానీ కలిస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు.
ధారవికి లక్ష కోట్లు వెచ్చిస్తున్నప్పుడు అది కుంభకోణమైతే... మూసీ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు. మీ వైఖరి బీజేపీకి భిన్నంగా ఉందా? మీ వైఖరి రాష్ట్రానికి రాష్ట్రానికి... ఎన్నికలకు ఎన్నికలకు మారుతుందా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్... ఈ రెండూ ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి సురక్షితం కావన్నారు.