Ramcharan: ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్!
- కడప దర్గాను సందర్శించిన రామ్‌చరణ్
- రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం చరణ్ దర్గా సందర్శన
- 80వ జాతీయ ముషైరా గజల్లో పాల్గొన్న చరణ్
ప్రస్తుతం కథానాయకుడు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రం ప్రమోషన్ వర్క్‌లో ఉన్నాడు. దీంతో పాటు చరణ్ తన తదుపరి చిత్రం చిత్రీకరణకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి మైసూర్లో ఆయన తాజా చిత్రం షూటింగ్లో పాల్గొంటాడు. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా గతంలో రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం రామ్‌చరణ్ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80 వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాకు రెహమాన్ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్ తీసుకొస్తానని ఆయన అక్కడి వాళ్లకు మాటిచ్చారట.
ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరో వైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రామ్‌చరణ్‌తో పాటు బుచ్చిబాబు కూడా దర్గాను సందర్శించుకున్నాడు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘ ఏఆర్ రెహమాన్ మూడు నెలల ముందే ఈ కార్యక్రమం గురించి చెప్పారు. ఆయనతో వస్తానని చెప్పడంతో ఆయన కోసం నేను అయ్యప్ప మాలలో ఉన్నా ఈ రోజు ఇక్కడికి వచ్చాను.
కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే, నా కెరీర్లో అతి ముఖ్యమైన సినిమాగా భావించే 'మగధీర' సినిమా విడుదలకు ముందు రోజు నేను ఈ దర్గాకు వచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించి, నా కెరీర్‌కు ఎంతటి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింతో తెలిసిందే. మళ్లీ ఈ రోజు నేను ఇక్కడకు రావటం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.
.