Bhuvaneswar AIIMS: గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. బతికించిన భువనేశ్వర్ డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే అరుదు!

Bhuvaneswar AIIMS Doctors Rebirth To Army Jawan Whose Heart Stopped For 90 Minutes

  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన 24 ఏళ్ల జవాను సాహు
  • ఆ వెంటనే ఆగిపోయిన గుండె
  • 40 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా ఫలితం శూన్యం
  • ఈసీపీఆర్‌తో మళ్లీ గుండెలో చలనం
  • ప్రస్తుతం స్పృహలోనే జవాను సాహు

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యుల ప్రయత్నాలతో తిరిగి కొట్టుకుంది. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 24 ఏళ్ల జవాను శుభాకాంత్ సాహు గత నెల 1న అనారోగ్యంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి గుండె పనిచేయడం మానేసింది. అతడిని బతికించేందుకు వైద్యులు 40 నిమిషాలపాటు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) ప్రయోగించాలని వైద్యులు నిర్ణయించారు. 

డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని వైద్య బృందం ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో)తో చికిత్స ప్రారంభించింది. దీంతో 90 నిమిషాల తర్వాత సాహు గుండెలో చలనం వచ్చి కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే లయ అసంబద్ధంగా ఉంది. ఆ తర్వాత క్రమంగా మెరుగుపడుతూ 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడింది. దీంతో 96 గంటల తర్వాత సాహుకు అమర్చిన ఎక్మోను తొలగించారు. ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదని, అయితే, గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు పనిచేస్తుందని వైద్య బృందం తెలిపింది.  వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News