Sunita Williams: 5 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న సునీతా విలియమ్స్ ఏం తింటున్నారో తెలుసా?
- అంతరిక్ష కేంద్రంలో విభిన్న ఆహార పదార్థాలు తింటున్న వ్యోమగాములు
- పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్‌టెయిల్స్, రోస్ట్ చికెన్, ట్యూనా తింటున్న నాసా వ్యోమగాములు
- వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా భూమిపైనే తయారీ
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వేడిచేసుకొని తినే అవకాశం
- ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆహార పదార్థాల చేరవేత
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఐదు నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. కేవలం 8 రోజుల పరిశోధన కోసం వెళ్లిన వారిద్దరు వాహన నౌక ‘బోయింగ్ స్టార్‌లైనర్’లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో అనూహ్యంగా చిక్కుకుపోయారు. అయితే వారిద్దరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో తిరిగి భూమికి తీసుకురావాలని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
అయితే ఇప్పటికే 5 నెలలుగా వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో ఉంటున్నారు. దాదాపు మరో మూడు నెలలు కూడా అక్కడే ఉండబోతున్నారు. దీంతో ఇంతకీ వ్యోమగాములు అక్కడ ఏం తిని బతుకుతున్నారంటూ అంతరిక్ష ఔత్సాహికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఎస్‌లో ఉన్నప్పుడు ఆహారం ఎలా లభిస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల నాసా విడుదల చేసిన ఫొటోల్లో సునీతా విలియమ్స్ బక్కచిక్కినట్టుగా కనిపించడంతో ఔత్సాహికుల ఆసక్తి మరింత పెరిగింది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ ఇద్దరూ పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్‌టెయిల్స్, రోస్ట్ చికెన్, ట్యూనా వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తింటున్నారు. ఈ విషయాన్ని ‘స్టార్‌లైనర్ మిషన్’కు చెందిన నిపుణుడు ఒకరు ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ఆహారంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు కూడా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆహార పదార్థాలను ఐఎస్ఎస్‌కు చేరవేస్తుంటారని తెలిపారు. పండ్లు, కూరగాయలను ప్యాకింగ్ చేస్తారని చెప్పారు. ఆహార పదార్థాలు గడ్డకట్టిన-ఎండిన స్థితిలో ఉంటాయని వివరించారు.
ఐఎస్ఎస్‌లో లభించే ఆహార పదార్థాలు ప్రతి వ్యోమగామి రోజువారీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తారని స్టార్‌లైనర్ నిపుణుడు పేర్కొన్నారు. ఫుడ్ వార్మర్‌ని ఉపయోగించి మళ్లీ వేడి చేసుకోవచ్చని వివరించారు. మాంసం, గుడ్లు అన్నింటిని భూమిపైనే వండుతారని, అంతరిక్షంలో మళ్లీ వేడి చేసుకొని తింటారని పేర్కొన్నారు. డీహైడ్రేటెడ్ సూప్‌లు, క్యాసరోల్స్‌లకు అవసరమైన నీటిని స్పేస్ స్టేషన్‌లో ఉండే 530 గాలన్ల మంచినీటి ట్యాంక్ నుంచి పొందుతుంటారని వెల్లడించారు. అయస్కాంతీకరించిన మెటల్ ట్రేలలో సునీతా విలియమ్స్, విల్మోర్ ఆహారాన్ని తింటున్నారని వివరించారు. ఇక నాసాకు చెందిన వైద్యులు ఎప్పటికప్పుడు తగినంత కేలరీలు లభించే ఫుడ్ తింటున్నారో లేదో నిర్దారిస్తుంటారని చెప్పారు.