Kidney damage: ఉదయమే ఈ లక్షణాలు కనిపిస్తే... కిడ్నీ సమస్య కావొచ్చు!

kidney damage symptoms in morning

  • ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న కిడ్నీ వ్యాధుల బాధితులు
  • తీవ్ర స్థాయికి చేరేదాకా గుర్తించలేక సమస్యలు
  • ముందే గుర్తిస్తే త్వరగా చికిత్స తీసుకోవచ్చని నిపుణుల సూచనలు

కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తీవ్ర ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, జంక్ ఫుడ్, సరిగా నీళ్లు తాగకపోవడం, డయాబెటిస్, ఆల్కహాల్ అలవాటు వంటివి దీనికి కారణం అవుతున్నాయి. అయితే చాలా మంది కిడ్నీ సమస్యలు తీవ్ర స్థాయికి చేరేదాకా గుర్తించలేకపోతున్నారు. దీనితో జీవితాంతం ఇబ్బందిపడుతున్నారు. ముందే లక్షణాలను గుర్తించగలిగితే.. త్వరగా చికిత్స తీసుకుని, సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా వ్యక్తుల్లో ఉదయం పూట ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే... వారి కిడ్నీలు దెబ్బతింటున్నట్టుగా భావించవచ్చని సూచిస్తున్నారు.

1. ముఖం, కాళ్లు వాపు రావడం
రాత్రి పూట బాగానే ఉన్నా... ఉదయం నిద్ర లేచే సమయానికి ముఖం, కాళ్లు వాపు రావడం కిడ్నీ సమస్యలకు ప్రధాన లక్షణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే... నిద్ర సరిగా లేకపోవడమో, మరొకటనో దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.

2. తీవ్రమైన నీరసం
ఉదయం లేవగానే తీవ్రంగా నీరసంగా అనిపించడం కూడా కిడ్నీ వ్యాధుల లక్షణాల్లో ఒకటి. కిడ్నీలు రక్తంలోని విష/వ్యర్థ పదార్థాలను వడగట్టి మూత్రం రూపంలో బయటికి పంపేస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకుంటే... ఆ వ్యర్థాలు రక్తంలోనే ఉండి తీవ్ర నీరసం ఆవహిస్తుంది.

3. మూత్రం రంగు మారడం, దుర్వాసన
పొద్దున్నే మూత్రానికి వెళ్లినప్పుడు నారింజ రంగు, ఎరుపు రంగులో వచ్చినా... విపరీతంగా దుర్వాసన వస్తున్నా... కిడ్నీలలో సమస్య ఉన్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.

4. పొద్దున్నే వికారంగా ఉండటం, వాంతులు కావడం
సాధారణంగా రాత్రంతా నిద్రపోయి లేచాక... శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఆకలి వేస్తుంది. కానీ ఉదయమే వికారంగా అనిపించడం, వాంతులు కావడం వంటివి కిడ్నీ సమస్యలకు లక్షణాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి, పొట్టలో అసౌకర్యంగా మారడం వంటివి దీనికి కారణమని చెబుతున్నారు.

5. శ్వాస సరిగా ఆడకపోవడం
ఉదయం పూట శ్వాస సరిగా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడం భారంగా అనిపించడం కూడా కిడ్నీ వ్యాధుల లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు రక్తాన్ని సరిగా శుభ్రపర్చకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు/వ్యర్థాలు చేరి... శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని వివరిస్తున్నారు.

వేరే ఆరోగ్య సమస్య కూడా అయి ఉండొచ్చు
పలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల కేవలం ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీ సమస్య వచ్చినట్టు భావించవద్దని సూచిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకుని... సమస్య ఏమిటో నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News