Civil Engineer: నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన
- 5.9 కేజీల బరువున్న 50 బంగారు కడ్డీల స్వాధీనం
- ఈజీ మనీ కోసమే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకోలు
రూ. 4.36 కోట్ల విలువైన 6 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దొరికిపోయాడో సివిల్ ఇంజినీర్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన టెంటుల్‌బెరియా బోర్డర్ ఔట్‌పోస్ట్ (5వ బెటాలియన్) పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24వ పరగణాల జిల్లా, అంచల్‌పాద గ్రామంలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రూ. 4.36 కోట్ల విలువైన 5.9 కేజీల బరువున్న 50 బంగారం కడ్డీలను మోసుకెళ్తున్న సివిల్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేశారు. ఈ గ్రామం టెంటుల్‌బెరియా బోర్డర్ ఔట్‌పోస్టుకు 2,700 మీటర్ల దూరంలో ఉంది.
బీఎస్ఎఫ్ సిబ్బందిని చూసి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిన స్మగ్లర్ పారిపోయే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అరెస్ట్ చేశారు. తేలికగా, వేగంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతోనే స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. తనకు అందిన స్మగ్లింగ్ వస్తువులను గంటా, రెండు గంటలపాటు ఇంట్లో ఉంచి, ఆ తర్వాత వాటిని సంబంధిత వ్యక్తులకు అందిస్తానని పేర్కొన్నాడు. ఇలా చేసినందుకు ఒక్కో డెలివరీకి రూ. 500 నుంచి రూ. 1000 ఇస్తారని తెలిపాడు.