Google: గూగుల్ ఇంటర్వ్యూలో ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారంటీ!

Google recruiter shared three tips on LinkedIn for aspiring tech professionals

  • లింక్డ్‌ఇన్ వేదికగా ‘స్టార్ మెథడ్’ను సిఫార్సు చేసిన గూగుల్ ఇంటర్వ్యూయర్‌ ఎరికా
  • అభ్యర్థిపై స్పష్టత వచ్చేలా, ఇంటర్వ్యూయర్ దృష్టి పెట్టేలా సమాధానాలు ఉండాలని సూచన
  • రెజ్యూమ్‌ని కూడా పాత్రకు తగ్గట్టుగా రూపొందించాలని సలహా

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం పొందాలని చాలా మంది టెకీలు కలలు కంటున్నారు. ఇందుకోసం అత్యంత కీలకమైన ఇంటర్వ్యూ దశను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొందరు ఆశావహులు తమలో నైపుణ్యాలు ఉన్నా ఇంటర్వ్యూలలో విఫలమవుతుంటారు. అలాంటివారి కోసం గూగుల్‌లో ఇంటర్వ్యూయర్‌గా పనిచేస్తున్న ఎరికా అనే మహిళా ఉద్యోగి అత్యంత కీలకమైన మూడు టిప్స్ చెప్పారు. లింక్డ్‌ఇన్ వేదికగా ‘స్టార్ మెథడ్’ (STAR) పేరిట ఆమె ఈ చిట్కాలు పంచుకున్నారు.

‘‘గూగుల్‌ ఇంటర్వ్యూలలో అభ్యర్థులు వారి సమాధానాలను తెలియజేయడానికి స్టార్ పద్ధతిని అవలంబించాలని నేను ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తాను. పరిస్థితిని వివరించండి. మీరు చేపట్టిన ప్రాజెక్ట్ గురించి క్లుప్తంగా చెప్పండి. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అమలు చేసిన చర్యలను వివరించండి. అలాగే మీరు సాధించిన ఫలితాలను కూడా జోడించండి. అంతే... ఈ విధానం అభ్యర్థిపై స్పష్టతనిస్తుంది. మీ సమాధానాలపై ఇంటర్వ్యూయర్‌ దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది’’ అని ఎరికా సలహాలు ఇచ్చారు. ఈ ‘స్టార్ మెథడ్’ని పాటిస్తే ఔత్సాహిక టెక్ నిపుణులు గూగుల్‌లో ఉద్యోగం పొందడం ఖాయమని ఆమె చెబుతున్నారు.

ఆశావహులు నియామక ప్రక్రియలో నిమగ్నమై ఉండడం, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సృజనాత్మకత ప్రదర్శించడం చాలా ముఖ్యమని ఎరికా సూచించారు. ఇంటర్వ్యూ చేసేవారు ఎలప్పుడూ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తుంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇంటర్వ్యూలు సవాళ్లతో కూడి ఉంటాయి కాబట్టి స్టార్ (STAR) పద్ధతి విజయానికి కీలక సాధనంగా ఉంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

రెజ్యూమ్ ఎలా ఉండాలంటే?
ఇక రెజ్యూమ్‌ని రూపొందించే విషయానికి వస్తే.. ఉద్యోగం అవసరాలకు తగిన అర్హతను తెలియజేస్తూ రూపొందించుకోవాలని టెకీలకు ఎరికా సూచించారు. ‘‘దరఖాస్తు చేస్తున్న పాత్ర గురించి తెలుసుకోండి. ముఖ్యంగా కనీస అర్హతల గురించి అవగాహన ఉండాలి. కంపెనీ అన్వేషిస్తున్న పాత్ర కోసం మీరు సిద్ధంగా ఉన్నట్టు మీ రెజ్యూమ్‌ను సిద్ధం చేసుకోవాలి. చేయాల్సిన ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, తదనుగుణంగా మీ అనుభవాన్ని చేర్చడం ద్వారా ఉద్యోగ పొందే అవకాశాలను గణనీయంగా పెంచుకోవచ్చు’’ అని ఎరికా వివరించారు.

చివరగా... ఆసక్తి ఉన్న జాబ్ రోల్ గురించి ఇప్పటికే ఆ స్థానంలో ఉన్న నిపుణులను అడిగి తెలుసుకోవాలని ఎరికా సూచించారు. ఇందుకోసం ఇప్పటికే అనుభవం ఉన్నవారిని సోషల్ మీడియాలో వెతకవచ్చని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News