Harsh Goenka: సంపన్నుల కోసం ప్రజాస్వామ్యం ఎదురుచూడాల్సిందే.. హర్ష్ గోయెంకా సెటైరికల్ ట్వీట్
- మలబార్ హిల్స్ లోని సెలబ్రిటీలు ఓటేయకపోవడంపై విమర్శ
- పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ కోసం చూస్తారని వ్యంగ్యం
- సాధారణ జనంతో క్యూలో వెళ్లి ఓటేయడం వారికి నామోషీ అంటూ ఫైర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెలబ్రిటీలను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఓటేయడానికి వెళ్లాలంటే మలబార్ హిల్స్ లోని సంపన్నులకు ఎక్కడలేని విసుగని, పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తారని విమర్శించారు. మనీశ్ మల్హోత్రా తన ఔట్ ఫిట్ కు సూటయ్యే కళ్ల జోడు కోసం వెతికేంత వరకూ ప్రజాస్వామ్యం వేచి ఉండాల్సిందేనని అన్నారు. ఇక, పోలింగ్ కేంద్రానికి బెంజ్ లో వెళ్లాలా? లేక బీఎండబ్ల్యూలో వెళ్లాలా? అనేది వారికి ఎదురయ్యే అతి పెద్ద సమస్య అని ఎద్దేవా చేశారు.
పోలింగ్ బూత్ వద్ద సామాన్యులతో కలిసి క్యూలో వెళ్లి ఓటేయడాన్ని వారు నామోషీగా భావిస్తుంటారని హర్ష్ గోయెంకా మండిపడ్డారు. ఈ సమస్యలను తప్పించుకోవడానికి వారు ఓటేయడమే మానుకుంటారని తీవ్రంగా విమర్శించారు. ముంబైలో పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ప్రతిసారీ అతి తక్కువ పోలింగ్ నమోదవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైతో పాటు పూణె, నాగ్ పూర్ వంటి నగరాల్లోనూ సగటు పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవుతుందన్నారు. కాగా, బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొమ్మిది గంటల వరకు అంటే.. తొలి రెండు గంటల్లో కేవలం 6.61 శాతం పోలింగ్ మాత్రమే నమోదైందని అధికారులు వెల్లడించారు.