Upasana Kamineni Konidela: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు.. దీటుగా బదులిచ్చిన ఉపాసన
- కడప దర్గాను దర్శించి ప్రార్థనలు చేసిన ఉపాసన
- అయ్యప్ప మాలలో దర్గాను సందర్శించడంపై విమర్శలు
- రామ్ చరణ్ సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారన్న ఉపాసన
- మసీదులో ప్రార్థనలు చేయడం శబరిమల ప్రత్యేక సంప్రదాయమంటూ ‘టీవోఐ’లో వచ్చిన కథనం షేర్ చేసిన ఉపాసన
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడంపై వస్తున్న విమర్శలకు ఆయన భార్య ఉపాసన కొణిదెల స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’ అని రాసుకొచ్చారు.
ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘మేడమ్.. ఇతర మతాలను గౌరవించడమంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదు’’ అని విమర్శించాడు. మన విశ్వాసాలను అవమానించకుండా వారి మతాన్ని గౌరవించవచ్చని పేర్కొన్నాడు. దీనికి ఉపాసన బదులిస్తూ.. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన ‘మసీదులో ప్రార్థనలు చేయడం శబరిమల ప్రత్యేక సంప్రదాయం’ శీర్షికను షేర్ చేశారు. శబరిమల వెళ్లడానికి ముందు భక్తులు మసీదులో ప్రార్థనలు చేస్తుంటారని ఆ కథనంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.