Brain food: ఉదయమే మెదడుకు బూస్ట్ ఇచ్చే.. మంచి బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ ఇదే!

This is the best breakfast food that gives a boost to the brain in the morning

  • కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ప్రత్యేక పోషకాలు
  • మెదడు చురుకుగా పనిచేసేందుకు తోడ్పడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ‘ఏ, ఈ విటమిన్లు’
  • బ్రేక్‌ ఫాస్ట్‌ గా ఈ ఆహారం తీసుకోగలిగితే రోజంతా మెదడు చురుగ్గా పనిచేసే వీలు

రాత్రంతా నిద్రపోయి మేల్కొన్నాక... ఉదయమే మెదడు ఫ్రెష్‌ గా ఉంటుంది. అలాంటి సమయంలో దానికి మరింత చురుకుదనాన్ని ఇచ్చే పోషకాలు అందితే... మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. అలా మెదడుకు అవసరమైన పోషకాలు అందేందుకు కొన్ని రకాల ఆహారం దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ గా ఈ ఆహారం తీసుకోగలిగితే... మెదడు ఆరోగ్యానికి, రోజంతా చురుకుగా ఉండేందుకు, ఏకాగ్రత పెరిగేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. నిపుణులు చెబుతున్న ఆ ఆహార పదార్థాలు, వాటి నుంచి లభించే పోషకాలు ఏవంటే...

సాల్మన్‌ చేపలు, గుడ్లు 
మాంసాహారం తీసుకునేవారు ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ లో సాల్మన్‌ చేపలు, ఉడికించిన గుడ్లను తీసుకోవడం వల్ల మెదడుకు మంచి చురుకుదనం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్‌ చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయని వివరిస్తున్నారు. ఇక గుడ్లలోని విటమిన్లు, ఖనిజాలు కూడా మంచి చురుకుదనాన్ని ఇస్తాయని పేర్కొంటున్నారు. 

పాలలో నానబెట్టిన ఓట్స్‌
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ గా పాలలో నానబెట్టిన ఓట్స్‌ తీసుకోవడం వల్ల మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుందని.. ఇది శరీరాన్ని రిలాక్స్‌ చేసి, మెదడుపై ఒత్తిడి తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

పసుపు...
ఉదయం తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్‌ లో కాసింత పసుపు కూడా ఉండేలా చూసుకుంటే... అందులోని పలు రసాయన సమ్మేళనాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, పెరుగు, బాదం, యాపిల్‌
పొద్దున్నే కొంత పెరుగులో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, తరిగిన బాదం పప్పులను వేసుకుని.. బ్రేక్‌ ఫాస్ట్‌ గా తింటే మెదడుకు అవసరమైన కీలక పోషకాలన్నీ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ తో రోజంతా మెదడు చురుకుగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
  • ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ కు తోడు ఒక యాపిల్‌ ను కూడా జత చేస్తే... ఉదయమే శరీరానికి కావాల్సిన శక్తి అంది, ఉత్సాహంగా పనిచేసుకోవచ్చని సూచిస్తున్నారు.

కాఫీ.. కాసిన్ని మంచి నీళ్లు
ఉదయమే కాఫీ తాగడం వల్ల అందులోని కెఫీన్‌ శరీరాన్ని, మెదడును ఉత్తేజితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరిమితికి మించి కాఫీ తీసుకోవడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
  • ఇక ఉదయం పరగడుపునే ఒకటి, రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగితే శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు బయటికి పోయి.. శరీరం, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News