Nara Lokesh: విద్యార్థులపై ప్రయోగాలు వద్దు: మంత్రి నారా లోకేశ్
- ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన ప్రపంచ బ్యాంకు బృందం
- విద్యావ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామన్న లోకేశ్
- విద్యార్థుల సామర్థ్యాలకు తగినట్టుగా సిలబస్, బోధన
- ఉపాధ్యాయుల బదిలీల కోసం యాప్ తీసుకువస్తున్నామని వెల్లడి
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా, ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలని విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేశ్ ఇవాళ తన చాంబర్‌లో సమావేశమయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కేంద్రంగా చేసుకుని విద్యావ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించి సత్ఫలితాలు సాధించే ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల వ్యక్తిగత అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసి, తదనుగుణంగా పాఠ్యప్రణాళిక, బోధన ఉండేలా SALT ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాలు-నైపుణ్యాలు, విద్యాశాఖ ప్రగతి, అందిస్తున్న సౌకర్యాలు వంటివన్నీ ప్రత్యేక డాష్‌బోర్డు రూపొందించి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఫలితాలను మెరుగుపరచడం ద్వారా అడ్మిషన్లను పెంచడం లక్ష్యం అని పేర్కొన్నారు.
ఇక, ఉపాధ్యాయుల బదిలీలలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చేసేందుకు, ఒక యాప్‌ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంతో పంచుకోవాలని కోరుతూనే, ఏపీలో సత్ఫలితాలు ఇస్తున్న ఉత్తమ విధానాలు ప్రపంచబ్యాంకు ముందు ఉంచుతామని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు, సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.