Sridhar Babu: ఈ సంస్థ ద్వారా రానున్న మూడేళ్ళలో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు: శ్రీధర్ బాబు
- రఘువంశీ ఏరోస్పేస్ కొత్త కారాగార నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
- శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి
- నూతన ఎంఎస్ఎంఈ విధానం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్న మంత్రి
రఘువంశీ ఏరోస్పేస్ సంస్థ రానున్న మూడేళ్లలో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శంషాబాద్ ఏరో స్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త కర్మాగార నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎంఈ విధానం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
రూ.300 కోట్లతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రఘువంశీ ఏరోస్పేస్ ఎయిర్ బస్, బోయింగ్‌తో పాటు పలు ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థలకు కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తోందన్నారు. 2002లో చిన్న పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ఏరోస్పేస్ ఇప్పుడు ఈస్థాయికి ఎదిగి రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసిందన్నారు. డీఆర్డీవో, ఇస్రో, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు పరికరాలను, విడిభాగాలను అందిస్తోందన్నారు.