Jhulan Goswami: భారత మహిళా క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామికి అరుదైన గౌరవం
- ఈడెన్ గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు
- ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదన
- జనవరి 22న ఈడెన్‌లో జరిగే భారత్, ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం
భారత మహిళా క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామిని కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో అపూర్వ రీతిలో సన్మానించనున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లోని ఓ స్టాండ్‌కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి పేరు పెట్టనున్నారు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) వెల్లడించింది. క్రికెట్ ఆటకు ఆమె చేసిన అసమానమైన సేవలకు గుర్తింపుగా బీ బ్లాక్ స్టాండ్‌కి ఆమె పేరు పెట్టాలని సీఏబీ ప్రతిపాదించింది.
2025 జనవరి 22న ఈడెన్‌లో జరిగే ఇండియా, ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉండనుంది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటికే మాజీ భారత కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, దివంగత పంకజ్ రాయ్, బీసీసీఐ మాజీ అధ్యక్షులు జగ్‌మోహన్ దాల్మియా, విశ్వనాథ్ దత్‌లతో సహా ఇతర క్రికెట్ దిగ్గజాల పేర్లతో స్టాండ్‌లు ఉన్నాయి.
కాగా, మహిళల క్రికెట్‌లో గొప్ప ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరైన ఝులన్ గోస్వామి.. భారత మహిళా క్రికెట్ జట్టుతో 20 ఏళ్ల కెరీర్‌ను కలిగి ఉన్నారు. 2002-2022 మధ్య ఆమె 204 వన్డేలు, 68 టీ20లు, 12 టెస్టులు ఆడారు. వన్డేల్లో ఏకంగా 255 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 355 వికెట్లు పడగొట్టారు.
ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఝులన్ గోస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ.. "ఇలాంటిది కార్యరూపం దాల్చుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అక్కడి నుంచి మ్యాచ్‌ని చూడటానికి నేను కచ్చితంగా ఇష్టపడతాను. ఏ క్రికెటర్‌కైనా ఆమె జిల్లా, రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించడం కలగా ఉంటుంది. కానీ ఇలాంటి గౌరవాన్ని అందుకోవడం నిజంగా గొప్ప అనుభూతి. జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాలనే సీఏబీ దృష్టి కారణంగా మాత్రమే సాధ్యమైంది. గడిచిన 8-10 ఏళ్లలో సీఏబీ మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడంలో అద్భుతంగా చేసింది" అని అన్నారు.
ప్రస్తుతం 41 ఏళ్ల ఝులన్ గోస్వామి మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు బౌలింగ్ కోచ్, మెంటార్‌గా కొనసాగుతున్నారు. ఆమె మార్గదర్శకత్వంలోనే ముంబై జట్టు డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌లో టైటిల్ కూడా గెలుచుకుంది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఆమె మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా కూడా మారారు. దాంతో ఆ జట్టు టైటిల్‌ను గెలవలేకపోయినప్పటికీ ఫైనల్ వరకు వెళ్లడంలో ఝులన్ గోస్వామి మెంటార్‌గా కీలక పాత్ర పోషించారు.