Viral News: ఫుల్లుగా తాగి తూలుతూ స్కూల్‌కి వచ్చిన హెడ్మాస్టర్, మరో టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
- గ్రామస్థుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు
- బీహార్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు చాలా హుందాగా నడుచుకోవాలి. విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచేలా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఫుల్లుగా మద్యం సేవించి స్కూల్‌కి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం ఫుల్లుగా మద్యం తాగి తూలుతూ స్కూల్‌కు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు, కాంట్రాక్ట్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లా గుల్ని గ్రామంలో జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. హెడ్ మాస్టర్ నాగేంద్రప్రసాద్, కాంట్రాక్టు టీచర్ సుబోధ్ కుమార్‌లను అరెస్ట్ చేశామని, ఫుల్లుగా తాగి స్కూల్లో వెర్రి చేష్టలకు పాల్పడుతున్నారని తెలిపారు. అసాధారణంగా, అనైతికంగా ప్రవర్తించడాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గుర్తించారని, వారు నిలదీసేందుకు ప్రయత్నించగా ఇద్దరూ కలిసి గ్రామస్థులను దుర్భాషలాడారని, దీంతో తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉందని, ఇద్దరూ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రసాద్, కుమార్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇద్దరూ సస్పెన్షన్ వేటుకు గురయ్యారని అధికారులు వెల్లడించారు.
కాగా ఉపాధ్యాయులు మద్యం మత్తులో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులోనే విద్యార్థులు, గ్రామస్థులతో వారు మాట్లాడటం కనిపించింది. మత్తు ఎక్కువై నడవలేక ఒక ఉపాధ్యాయుడు రోడ్డు మీదే పడిపోవడం కూడా రికార్డు అయింది. దీంతో అతడిని వ్యాన్‌లోకి ఎక్కించుకొని పోలీసులు తీసుకెళ్లారు.
అరెస్ట్ చేసిన పోలీసుల్లోనూ తాగుబోతు
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్లోనూ ఒకరు మద్యం తాగి ఉన్నారని గ్రామస్థులు మండిపడ్డారు. ఉపాధ్యాయులను వ్యాన్ వైపు ఈడ్చుకెళ్లిన పోలీసు తాగి ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సదరు పోలీసును అక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్‌కు పంపించివేశారు.