Rahul Gandhi: అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి: రాహుల్ గాంధీకి కేటీఆర్ డిమాండ్

KTR demand to cancel MOUs with Adani

  • రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయాలన్న కేటీఆర్
  • స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కివ్వాలని డిమాండ్
  • అదానీతో రేవంత్ దోస్తీ అధిష్ఠానానికి తెలిసే జరుగుతోందా? కాదా? అని కేటీఆర్ ప్రశ్న

రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్కిల్ యూనివర్సిటికీ అదానీ ఇచ్చిన రూ.100 కోట్లను వెనక్కి ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను అదానీకి తాకట్టు పెట్టడం సరికాదన్నారు.

మన కంటే చిన్న... పేద దేశమైన కెన్యా అదానీతో అన్ని వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుందన్నారు. మరి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదిరిన ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. అదానీ నుంచి ఎంత మేర ఆశించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అదానీపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ... రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

తాము అధికారంలో ఉన్న పదేళ్లు అదానీ తెలంగాణకు రాకుండా నిలువరించామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి అదే అదానీతో దోస్తీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు నిలువరించడం లేదన్నారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్న కాంగ్రెస్... తెలంగాణలో మాత్రం ఎందుకు దోస్తీ చేస్తోందన్నారు. అదానీతో దేశానికి నష్టమని చెప్పిన రాహుల్ గాంధీ... ఆయనతో తెలంగాణకు కూడా నష్టం కాదా? చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాట కాదని.. వారి మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? అని నిలదీశారు.

అదే జరిగితే మాత్రం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా? లేదా? చెప్పాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం రేవంత్ రెడ్డి అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించారని, ఇది తప్పా? కాదా? రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అవినీతిపరుడు అంటున్న రాహుల్ గాంధీ... తెలంగాణ సీఎంను నీతిమంతుడు అని ఎలా అంటారని నిలదీశారు.

అదానీతో వ్యాపార సంబంధాలు రాహుల్ గాంధీకి తెలిసి జరిగితే... ఇది ఆయన డబుల్ స్టాండ్‌కు నిదర్శమని విమర్శించారు. రాహుల్ గాంధీ మాటలు పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి సొంతగా అదానీతో దోస్తీ చేస్తున్నారంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీని అరెస్ట్ చేయాలని ఓ వైపు రాహుల్ గాంధీ చెబుతుంటే, అదే అదానీతో ఎందుకు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారో రేవంత్ రెడ్డి కూడా చెప్పాలన్నారు.

అదానీ... రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, మహారాష్ట్రలో ఎన్సీపీ రెండుగా కావడంలో ఆయన పాత్ర ఉందని తెలిసిందన్నారు. ఇటీవల కోహినూర్ హోటల్లో అదానీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారని, కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు బీజేపీ వాషింగ్ మిషన్‌లోకి వెళుతున్నారా? అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో అదానీని గజదొంగ అన్న రేవంత్ రెడ్డి... ఇక్కడ మాత్రం ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. అదానీ విషయంలో బీజేపీ కూడా ఏమీ మాట్లాడటం లేదన్నారు.

  • Loading...

More Telugu News