Harish Rao: రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య... తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish Rao hot comments on Ex Sarpanch suicide in Revanth Reddy village

  • కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య
  • మాజీ సర్పంచ్ ఆత్మహత్య కలిచివేసిందన్న హరీశ్ రావు
  • మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయన్న హరీశ్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది తనను కలచివేసిందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాక్షాత్తు సీఎం సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనమని పేర్కొన్నారు.

"రేవంత్... నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ను ఆత్మహత్యకు ఉసిగొల్పిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి" అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ రాసిన సూసైడ్ నోట్ ను ఆయన ట్వీట్‌లో జత చేశారు.
 
న‌డిరోడ్డుపై సర్వే పత్రాలు అంటూ ఆగ్రహం

నాడు ప్రజాపాలన దరఖాస్తులు నడిరోడ్డుకు ఎక్కాయని, ఇప్పుడు మళ్లీ ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు రోడ్లపై కనిపిస్తున్నాయని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? అని ప్రశ్నించారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 
సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటన పట్ల సీరియస్‌గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News