Wayanad by Election: ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్‌లో కౌంటింగ్ సరళి ఎలా ఉందంటే..!
- ఆరంభ ట్రెండ్స్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రియాంక
- ప్రధాన పోటీదారులుగా ఉన్న సీపీఐ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్
- 5 లక్షల మెజారిటీ లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్
- ప్రచారంలో పాల్గొన్న సోనియా, రాహుల్ గాంధీలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగిన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంపై యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత ట్రెండ్‌ను గమనిస్తే.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉదయం 9.30 గంటలకు 25 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
వయనాడ్ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయబరేలీలో గెలిచారు. అయితే రాయబరేలీ అట్టిపెట్టుకొని వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగారు. ఆమెను 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంగా తల్లి సోనియా గాంధీతో పాటు అన్న రాహుల్ గాంధీ కూడా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా 2019లో రాహుల్ గాంధీ తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.