Revanth Reddy: ప్రియాంక గాంధీ గెలుపుపై స్పందించిన రేవంత్ రెడ్డి, షర్మిల
- ఈ క్షణాలు దేశానికి, డెమోక్రసీకి ప్రత్యేకమన్న రేవంత్ రెడ్డి
- ప్రజల హక్కులు, అవకాశాల కోసం ప్రియాంక పోరాడుతారన్న భట్టి విక్రమార్క
- రాజ్యాంగ విలువలకు మద్దతుగా ప్రజల గొంతును బలంగా వినిపిస్తారన్న షర్మిల
వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వయనాడ్ నుంచి రికార్డ్ విజయం సాధించారని పేర్కొన్నారు.
ఆమె పార్లమెంట్లోకి అడుగిడుతున్న క్షణాలు మన దేశానికి, డెమోక్రసీకి ప్రత్యేకమని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహిళా గొంతు పార్లమెంట్లో వింటారని తెలిపారు. ప్రియాంక గాంధీ గెలుపును ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడన్నారు.
వయనాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శుభాకాంక్షలు చెప్పారు. ప్రగతి, సుస్థిరత కోసం కాంగ్రెస్ పార్టీ దార్శనికత అవసరమని ఈ గెలుపు ద్వారా మరోసారి వెల్లడైందన్నారు. ప్రజల హక్కులు, అవకాశాల కోసం అలుపెరగని పోరాటం చేస్తారని, వయనాడ్ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ గెలుపుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు. అద్భుత విజయం సాధించారంటూ ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు మద్దతుగా ప్రజల గొంతును లోక్ సభలో బలంగా వినిపిస్తారని పేర్కొన్నారు.