Ramveer Thakur: యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అపూర్వ విజయం.. ఆశ్చర్యపోతున్న రాజకీయ వర్గాలు

Ramveer Thakur defeated SPs Haji Rizwan by 1 lakh votes in Muslim dominance constituency
  • 65 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న కుందర్కి అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపు
  • 11 మంది ముస్లిం అభ్యర్థులను ఓడించిన రామ్‌వీర్ ఠాకూర్
  • సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో విజయం
  • షేక్ కమ్యూనిటీకి చేరువవ్వడంతో సాధ్యమైన విజయం
మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వేర్వేరు స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా శనివారం వెలువడిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌‌లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ-6, సమాజ్‌వాదీ పార్టీ-2, ఆర్ఎల్‌డీ-1 సీట్లు గెలుచుకున్నాయి. అయితే కుందర్కి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. 65 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ ఠాకూర్ సంచలన విజయం సాధించారు. ఏకంగా 1 లక్షకు పైగా మెజారిటీతో అపూర్వ విజయం సాధించారు. ఈ స్థానంలో ఏకంగా 11 మంది ముస్లిం అభ్యర్థులను ఆయన ఓడించారు.

భారత ఎన్నికల సంఘం డేటా ప్రకారం తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ హాజీ రిజ్వాన్‌పై లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో రామ్‌వీర్ ఠాకూర్ గెలిచారు. 65 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన విజయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ముస్లిం ఓటర్లకు, మరీ ముఖ్యంగా షేక్‌లకు దగ్గరవ్వడంతోనే రామ్‌వీర్ సింగ్ వ్యూహాత్మక విజయం సాధించారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. షేక్ కమ్యూనిటీకి చేరువకావడం ఆయన  విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిందని పేర్కొంది.

కాగా కుందర్కి నియోజకవర్గం మత రాజకీయాలకు పెట్టింది పేరు. కానీ ఫలితాన్ని బట్టి చూస్తే ముస్లిం సమాజంలో ఉప సమూహాల మధ్య దూరం పెరిగినట్టు స్పష్టమవుతోందని రాజకీవర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్‌వీర్ సింగ్ ఈ స్థానంలో గత రెండు దశాబ్దాలుగా చిట్టచివరి స్థానంలో నిలుస్తూ వచ్చారు. దీంతో ఆయనపై సానుభూతి ఏర్పడిందని స్థానిక నాయకులు చెబుతున్నారు. వరుసగా మూడు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఆయన స్థానికులకు దగ్గరగానే ఉండడం సానుకూలంగా మారిందని, స్థానికులకు ఏ అవసరం ఉన్నా సహాయం చేస్తూ వ్యక్తిగతంగా ఇమేజ్‌ను పెంచుకున్నారని చెబుతున్నారు. ముస్లింల ప్రార్థన టోపీ, కండువా ధరించడం వంటి సంజ్ఞలు ముస్లింలకు ఆయనపై నమ్మకం కుదిరేలా చేశాయి. షేక్ కమ్యూనిటీ ఆయనకు మద్దతుగా నిలిచింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ రామ్‌వీర్ సింగ్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయింది.
Ramveer Thakur
Uttar Pradesh
UP By Election
BJP

More Telugu News