Yashasvi Jaiswal: పెర్త్ టెస్టులో సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal scored a century in the Perth Test and created a record
  • ఆసీస్ గడ్డపై తొలి సెంచరీ అందుకున్న జైస్వాల్
  • రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం
  • 23 ఏళ్ల లోపు వయసులోనే    
భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి శతకాన్ని నమోదు చేశాడు. వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద జాస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది గ్రాండ్‌గా సెంచరీ సాధించాడు. 205 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. 2014-15లో సిడ్నీలో కేఎల్ రాహుల్ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ అందుకున్న ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 

జైస్వాల్ రికార్డు సెంచరీ..
23 ఏళ్ల లోపు వయసులోనే ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన 5వ భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్, 1993లో వినోద్ కాంబ్లీ చెరో నాలుగు సెంచరీలు సాధించారు. ఇక 1984లో రవిశాస్త్రి, 1992లో సచిన్ టెండూల్కర్ చెరో మూడు శతకాలు నమోదు చేయగా.. వారికి సమానంగా  2024లో యశస్వి జైస్వాల్ 3 సెంచరీలు సాధించాడు.

ఇక 23 ఏళ్లలోపే అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లి సరసన యశస్వి జైస్వాల్ నిలిచారు. వీళ్లు ముగ్గురూ 4 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో 8 శతకాలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో, 5 సెంచరీలతో రవిశాస్త్రి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.

కాగా పెర్త్ టెస్ట్ మూడవ రోజు ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 172/0 వద్ద ఓపెనర్లు బ్యాటింగ్ ఆరంభించారు. ఆట మొదలైన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. వ్యక్తిగత స్కోరు 77 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగిగాడు. దీంతో 201 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో దేవధూత్ పడిక్కల్, జైస్వాల్ ఆడుతున్నారు.
Yashasvi Jaiswal
Perth test
Cricket
Sports News

More Telugu News