Yashasvi Jaiswal: ఆసీస్ గ‌డ్డ‌పై య‌శ‌స్వి జైస్వాల్ తొలి శ‌త‌కం.. తొలి ప‌ర్య‌ట‌న‌లోనే అరుదైన ఘ‌న‌త‌.. రికార్డుల మోత‌

Yashasvi Jaiswal Maiden Hundred in Australia

  • పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ తొలి టెస్టు
  • సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్
  • ఆస్ట్రేలియాలో ఆడిన మొద‌టి టెస్టులోనే శ‌తకం బాదిన మూడో భార‌త బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌
  • మ‌రెన్నో రికార్డులను త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ ప్లేయ‌ర్‌
  • ఇప్ప‌టికే 250 దాటిన టీమిండియా ఆధిక్యం

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ బాదాడు. ఇది ఆసీస్ గ‌డ్డ‌పై అత‌నికి తొలి శ‌త‌కం. అలాగే ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న తొలిసారే యువ ఆట‌గాడు శ‌త‌కం న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. జైస్వాల్ కంటే ముందు ఇలా త‌మ తొలి ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో ఎంఎల్ జైసింహా (బ్రిస్బెన్‌), సునీల్ గ‌వాస్క‌ర్ (బ్రిస్బెన్‌) సెంచ‌రీలు బాదారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే శ‌త‌కాలు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. 

అలాగే ఆస్ట్రేలియాపై సెంచ‌రీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెన‌ర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. అత‌డు 22ఏళ్ల 330 రోజుల వ‌య‌సులో ఈ ఘ‌న‌త సాధించ‌గా.. కేఎల్ రాహుల్ 22 ఏళ్ల 263 రోజుల వ‌య‌సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 

అంతేగాక 23 ఏళ్లు రాక‌ముందే ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక టెస్టు శ‌త‌కాలు బాదిన బ్యాట‌ర్ల జాబితాలో జైస్వాల్‌ది ఐదో స్థానం. ఈ సంవ‌త్స‌రం ఈ యువ ఆట‌గాడు ఇప్ప‌టివ‌ర‌కు 3 సెంచ‌రీలు న‌మోదు చేశాడు. అంద‌రికంటే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్క‌ర్ (1971లో 4 శ‌త‌కాలు) బాదాడు. 

అలాగే భార‌త్ త‌ర‌ఫున 23 ఏళ్ల వ‌య‌సులోపే టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన ఐదో బ్యాట‌ర్ జైస్వాల్ (4). స‌చిన్ టెండూల్క‌ర్‌ అంద‌రికంటే ఎక్కువ‌గా 8 శ‌త‌కాలు చేశాడు.     

ఇక‌ 95 పరుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు య‌శ‌స్వి సిక్స‌ర్ కొట్టి సెంచ‌రీ న‌మోదు చేయ‌డం విశేషం. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 172/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మ‌రో 29 ప‌రుగులు జోడించి 201 ర‌న్స్ వ‌ద్ద కేఎల్ రాహుల్ (77) వికెట్‌ను కోల్పోయింది. దీంతో రాహుల్‌, జైస్వాల్ ద్విశ‌త‌క భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఇప్ప‌టికే భార‌త్ ఆధిక్యం 250 దాటింది. ప్ర‌స్తుతం భార‌త్ స్కోర్ 214/1 (66 ఓవ‌ర్లు). క్రీజులో జైస్వాల్ (110), ప‌డిక్క‌ల్ (04) ఉన్నారు.

  • Loading...

More Telugu News