Pawan Kalyan: సీఎం మార్గదర్శకత్వంలో టూరిజంను ముందుకు తీసుకెళతాం: పవన్ కల్యాణ్
- పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
- టూరిజం అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న పవన్
ఏపీలో పర్యాటక అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళతామని పవన్ స్పష్టం చేశారు. వారసత్వ ప్రాంతాలను గుర్తించి, వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు విశిష్టత తెలిపేలా ప్రచార కార్యక్రమాలు జరుపుతామని అన్నారు.
టూరిజం అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పవన్ వివరించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామని... ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో టూరిజం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
టూరిజం వల్ల అనేక దేశాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు. ఆలయాలు, పర్యావరణం, క్రీడలతో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉందని, ఆ మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.