Nara Lokesh: టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డు బ్రేక్... కేడర్ కు ఫోన్ లో లోకేశ్ అభినందనలు

Nara Lokesh appreciates TDP Cadre for record breaking party membership

  • 29 రోజుల్లోనే 50 లక్షలకు చేరుకున్న సభ్యత్వం
  • ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని క్యాడర్ కు లోకేశ్ పిలుపు
  • పార్టీలో సరికొత్త విధానానికి శ్రీకారం
  • కష్టపడే కార్యకర్తలకు రిఫరల్ సిస్టం ద్వారా గుర్తింపు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. పార్టీ స్థాపించిన గత 43 ఏళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అతి తక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తయింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటిపోయింది. 

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేట నియోజకవర్గం 93,299 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుప్పం 82,176, కళ్యాణదుర్గం 77,720, పాలకొల్లు 72,720, మంగళగిరి 65,899 సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి. 

ఇదిలా ఉండగా, చాలాకాలం తర్వాత తెలంగాణలో సైతం ఈసారి సభ్యత్వ నమోదు పుంజుకోవడం శుభ పరిణామం. 100 రూపాయల సభ్యత్వంతో గతంలో రూ. 2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచారు.

గతానికి భిన్నంగా ఈసారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ కొనసాగుతోంది. లోకేశ్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టంకు శ్రీకారం చుట్టారు. సభ్యత్వ నమోదులో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముందు వరసలో నిలిచిన వారిని మంత్రి లోకేశ్ నేరుగా ఫోన్ చేసి స్వయంగా అభినందిస్తున్నారు. దీంతో శాసనసభ్యులు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 

రిఫరల్ సిస్టంలో కష్టపడిన కార్యకర్తను నేరుగా గుర్తించే విధానం అమల్లోకి తేవడంతో క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తోంది. తాజా విధానంలో బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు చేసిన ప్రతి పని కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తమవుతుంది. ఏదేని పదవులకు అభ్యర్థులను ఎంపికచేసే సమయంలో సిఫారసులతో పనిలేకుండా నేరుగా గుర్తించి పదవులిచ్చే విధానం అమల్లోకి తెచ్చారు. ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవుల నియామకాల్లోనూ ఇదే విధానం అనుసరించారు.


  • Loading...

More Telugu News