Tirumala: పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం

Theft in Srivari Hundi in broad daylight in Tirumala

  • స్టీల్ హుండీలో కొంత నగదు చోరీ
  • సీసీ కెమెరాల్లో గుర్తించి దొంగను అదుపులోకి తీసుకున్న సిబ్బంది
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తిరుమలలో అనూహ్య ఘటన జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో దొంగతనం జరిగింది. నవంబర్ 23న శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలోని కొంత నగదును దొంగిలించాడు. పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొంత నగదును చోరీచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు.
 
యువకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. భద్రతా సిబ్బంది తమ ఆఫీస్‌లో అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఆ దొంగ నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగం అని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందినవాడని వివరించారు. అనంతరం టీటీడీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి సంబంధించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News