Angada Kanhar: బీజేడీలో ఒకప్పుడు పవర్ఫుల్ ఎమ్మెల్యే.. ఇప్పుడు గర్వించదగ్గ సాధారణ రైతు!
- 1983లో రాజకీయాల్లో అడుగుపెట్టిన అంగద కన్హర్
- సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా వీఐపీ కల్చర్‌ను ఒంటికి పట్టించుకోని వైనం
- పూర్వీకుల గ్రామంలో సాధారణ రైతులా పొలం పనులు చేస్తూ గడుపుతున్న అంగద
- ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శం
ఒకప్పుడు ఆయన ఒడిశాలోని అధికార బీజేడీ (బిజూ జనతా దళ్) పార్టీలో కీలకమైన, శక్తిమంతమైన నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వీఐపీ కల్చర్, విలాసవంతమైన జీవితం, తన కోసం ఎదురు చూసే వేలాదిమంది.. వీటన్నింటినీ ఏమాత్రం ఒంటికి పట్టించుకోని ఆయన ఇప్పుడు సాధారణ రైతులా జీవిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పేరు అంగద కన్హర్.
అంగద ఏళ్ల తరబడి రాజకీయాల్లో మునిగి తేలినప్పటికీ తన మూలాలు మాత్రం మట్టిలోనే ఉన్నాయని గ్రహించారు. అందుకే భార్య, కుమారుడు పూర్ణచంద్ర కన్హర్, కోడలు జ్యోతిర్మయి ప్రధాన్ కలిసి పొలం దున్నుతూ, పంటలు సాగు చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. రైతు పురోగతి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెబుతారు అంగద. ఫుల్బానీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం ఫిరింగియా బ్లాక్‌లోని తన పూర్వీకుల గ్రామంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో ఆయనకు 29 ఎకరాల భూమి ఉండగా, అందులో 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
పోషకాలు మెండుగా ఉండే కలబాటి వడ్లు, నల్ల పసుపు వంటి ప్రత్యేకమైన పంటలను అంగద సాగు చేస్తున్నారు. కలబాటి బియ్యం డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. నల్ల పసుపులో బోల్డన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. త్వరలోనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయబోతున్నట్టు చెప్పారు.
1983లో రాజకీయాల్లో అడుగుపెట్టిన అంగద నాలుగు సార్లు సర్పంచ్‌గా గెలిచారు. రెండుసార్లు జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. ఒకసారి ఫిరింగియా బ్లాక్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2019లో ఫుల్బానీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనుభవించిన ఆయన వీఐపీ కల్చర్‌ను తన ఒంటికి అంటించుకోకపోవడం విశేషం. 58 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి 72 శాతం మార్కులతో పాస్ కావడం చదువుపై ఆయనకున్న శ్రద్ధను చూపుతోంది.