Gudivada Amarnath: అదానీ సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం: గుడివాడ అమర్ నాథ్
- సెకీతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న అమర్ నాథ్
- రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపాటు
- ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని విమర్శ
సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని చెప్పారు. అదానీ సంస్థతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని... నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. రైల్వే భవనాల నిర్మాణానికి తమ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందని చెప్పారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖలో వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.