Pawan Kalyan: నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురంలో హాల్ట్... రైల్వే మంత్రిని కోరిన పవన్
- ఢిల్లీలో పవన్ కల్యాణ్ పర్యటన
- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం
- పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరమని వెల్లడి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. పిఠాపురంలో నాలుగు ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ మంజూరు చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
నాగావళి ఎక్స్ ప్రెస్ (నాందేడ్-సంబల్పూర్), నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షిర్డీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం-సాయి నగర్), ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం-న్యూఢిల్లీ) రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ అవసరమని స్పష్టం చేశారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ నాలుగు రైళ్లు సౌకర్యంగా ఉంటాయని పవన్ కల్యాణ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.
అదే సమయంలో... లాతూరు నుంచి తిరుపతికి రైలు వేయాలని లాతూరు ప్రజలు కోరుతున్నారని, వారి విజ్ఞాపనను పరిశీలించాలని కోరారు.
ఇక, పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట–ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని తెలిపారు. సత్వరమే రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.