MP Sanjay Raut: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి... ఎంపీ సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు!
- మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైనందున రాష్ట్రపతి పాలన విధించాలన్న ఎంపీ
- ఇప్పటి వరకూ సీఎం ఎవరు అనేది నిర్ణయించలేకపోయిందంటూ మండిపాటు
- నిన్నటితో అసెంబ్లీ గడువు కూడా ముగిసిందని గుర్తు చేసిన సంజయ్‌రౌత్
మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలో శివసేన (యూటీబీ) నేత, ఎంపీ సంజయ్‌రౌత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటులో విఫమైందంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకూ సీఎం ఎవరు అనేది నిర్ణయించలేకపోయింది. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
"ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ మెజారిటీ సాధించింది. మంగళవారం (నవంబర్ 26)తో అసెంబ్లీ గడువు ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకూ సీఎం ఎవరో కూడా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఎలా సాధ్యమవుతుంది. శాసనసభ పదవీకాలం ఈ నెల 26తో ముగిసింది కనుక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి" అని సంజయ్‌రౌత్ అన్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం మంగళవారం సీఎం ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు మహారాష్ట్ర తదుపరి సీఎంను నిర్ణయించడం కోసం తర్జనభర్జన పడుతున్నారు.