Nirmal District: దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు

Collector orders to stop Ethanal industry works in Nirmal district

  • ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో స్థానికుల నిరసన
  • నిన్న, ఉద్రిక్తంగా మారిన నిరసన కార్యక్రమం
  • స్థానికులతో చర్చలు జరిపిన కలెక్టర్

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ వద్దని స్థానికులు కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈరోజు వీరితో చర్చలు జరిపిన కలెక్టర్... పరిశ్రమ పనులకు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పారు.

సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ వారికి చెప్పారు. ఈ క్రమంలోనే పరిశ్రమ పనులు నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని నిర్ణయించుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పరిశీలన చేస్తోంది. అవసరమైతే ఈ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తోందని సమాచారం.

ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు రద్దు చేయాలంటూ నిన్న గ్రామస్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు నిర్మల్ - భైంసా రహదారిపై నిరసన చేపట్టారు. పలువురు మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన చేపట్టారు. పరిస్థితులు చేజారకుండా కొంతమందిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. పలువురు నిరసనకారులు పోలీసులపై దాడి చేశారు. వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది.

  • Loading...

More Telugu News