KTR: తప్పు ఒప్పుకొని వెనక్కి తగ్గినంత మాత్రాన రేవంత్ రెడ్డి కిరీటం పడిపోదు: కేటీఆర్

KTR says Revanth Reddy should cancel Lagacharla Pharma project

  • దిలావర్‌పూర్‌లో దిగొచ్చినట్లుగానే లగచర్లలోనూ లెంపలేసుకోవాలన్న కేటీఆర్
  • అమాయకుల భూములను దొంగచాటుగా లాక్కునే కుట్రలకు తెరదించాలన్న స్పష్టీకరణ
  • సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు ప్రధాని కూడా వెనక్కి తగ్గిన చరిత్ర ఉందని వెల్లడి

తప్పు ఒప్పుకొని వెనక్కి తగ్గినంత మాత్రాన రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దిలావర్‌పూర్‌లో రైతుల దెబ్బకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలోనూ లెంపలేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వెంటనే లగచర్లలో... అల్లుడి కోసం... అదానీ కోసం...  ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలని పేర్కొన్నారు. అక్కడ శాంతిని నెలకొల్పాల్సి ఉందన్నారు.

ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ళ ముందు ఉందని కేటీఆర్ రాసుకొచ్చారు. అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్‌లో ఇథనాల్ మంటలను రాజేశారని ఆరోపించారు.

తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని... ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తమవుతోందన్నారు. ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం... వారి మనోభావాలను గౌరవించడమనేది పాలకుడి ప్రాథమిక విధి అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే... సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హితవు పలికారు. లేదంటే జరిగే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News