Chandrababu: నారా లోకేశ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu appreciates Nara Lokesh for large number of TDP Memberships in a short while

  • కొద్ది వ్యవధిలోనే 52 లక్షల టీడీపీ సభ్యత్వాల నమోదు
  • టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు
  • సరైన వ్యక్తిని సరైన చోట ఉంచుతామని చెప్పామని వెల్లడి
  • ఆ ప్రకారమే... కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులిచ్చామని స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వల్ప వ్యవధిలోనే 52 లక్షల టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను అభినందించారు. సభ్యత్వ నమోదులో తొలి 10 స్థానాల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులను కూడా అభినందించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారి కష్టానికి తగిన గుర్తింపును ఇచ్చామని అన్నారు. సరైన వ్యక్తిని సరైన చోట ఉంచుతామని చెప్పామని, చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. 

ఇక, కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తీసుకువచ్చామని చంద్రబాబు వెల్లడించారు. పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. త్వరలో సాగునీటి సంఘాలు, సహకార సంఘాల ఎన్నికలు ఉన్నాయని... ఈ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే గెలిచేలా కృషి చేయాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

భవిష్యత్తులో కార్యకర్తలను ఆర్థికంగానూ, రాజకీయంగానూ పైకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గడచిన ఐదేళ్లలో పార్టీ క్యాడర్ బీమా, ఆరోగ్యం, విద్య కోసం రూ.140 కోట్ల మేర సాయం అందించామని వెల్లడించారు.

సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు లేకుండా చూస్తాం

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,400 కోట్లు మంజూరు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు లేకుండా చూస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకెళుతున్నామని వివరించారు. 

మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేసేవారికి చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. గత ఐదేళ్లు విచ్చలవిడిగా ఎక్కడిక్కడ భూ సమస్యలు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తామని చెప్పారు. 


  • Loading...

More Telugu News