KTR: అది కేటీఆర్ ప్రాజెక్టు... తలసాని కొడుకు పరిశ్రమే: ఇథనాల్ ప్రాజెక్టుపై టీపీసీసీ చీఫ్

TPCC chief on Ethanol project in Dilavarpur

  • ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అన్న టీపీసీసీ చీఫ్
  • ఇప్పుడేమీ తెలియనట్లు రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం
  • నిర్మల్ ప్రజలు నిజాలు తెలుసుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లోని ఇథనాల్ పరిశ్రమ కేటీఆర్ ప్రాజెక్టు అని, ఆయనతో ఉన్న సంబంధాలతోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి అనుమతులు ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని... ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఆ పార్టీయే రైతులు రెచ్చగొడుతోందని విమర్శించారు.

బుధవారం నాడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఇథనాల్ పరిశ్రమ విషయంలో మాట్లాడటానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని విమర్శించారు. వారి హయాంలోనే ఈ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రైతుల మధ్యనే తేల్చుకునేందుకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. నిర్మల్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని... బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని కోరారు.

దిలావర్‌పూర్‌లో పరిస్థితులను పరిశీలించాకే ఇథనాల్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే వాటిని భుజాన మోసింది బీఆర్ఎస్ కాదా? అని నిలదీశారు. వెనుకబడిన లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ తెస్తుంటే బీఆర్ఎస్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తోందన్నారు. ఇలాంటి విమర్శలతో బీఆర్ఎస్‌కు తాత్కాలిక ఆనందం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.

  • Loading...

More Telugu News