Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ నుంచి త‌ర‌లిపోయే అవకాశం.. ఈసారి బీసీసీఐ మాత్రం కార‌ణం కాదు!

Pakistan At Risk Of Losing Champions Trophy Completely Not Because Of BCCI

  • వ‌చ్చే ఏడాది ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం 
  • ప్ర‌స్తుతం మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌ద్ధ‌తుదారుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న‌ ఇస్లామాబాద్ 
  • తాజాగా ఈ నిర‌స‌న‌ల కార‌ణంగా శ్రీలంక-ఏ జ‌ట్టు పాక్ నుంచి తిరుగుముఖం
  • ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు కూడా పాక్‌కు వెళ్లేందుకు విముఖ‌త‌
  • దాంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడ‌ల్‌ను అంగీక‌రించే అవ‌కాశం అంటూ క‌థ‌నాలు

వ‌చ్చే ఏడాది ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, బీసీసీఐ భార‌త జ‌ట్టును ఆ దేశానికి పంపించ‌బోమ‌ని తేల్చి చెప్పేసింది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం టీమిండియా పాక్‌కు రావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతోంది. మ‌రోవైపు భార‌త్ ఐసీసీ వ‌ద్ద‌ హైబ్రిడ్ మోడ‌ల్‌ ప్ర‌తిపాద‌న‌ను తీసుకువ‌చ్చింది. దాంతో ఐసీసీ కూడా ఇదే విష‌యాన్ని పీసీబీ వ‌ద్ద ప్ర‌తిపాదించింది. కానీ, దీనిపై పాక్ మౌనం వ‌హిస్తోంది. దాంతో ఐసీసీ శుక్ర‌వారం (29న‌) ఈ విష‌య‌మై పీసీబీ, బీసీసీఐల‌తో వ‌ర్చువ‌ల్‌గా భేటీ కావాల‌ని నిర్ణ‌యించింది. 

ఇదిలాఉండ‌గా.. ఇప్పుడు మ‌రో కార‌ణం చేత పాక్ నుంచి పూర్తిగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర‌లిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఆ దేశంలో తాజా రాజకీయ అశాంతి కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా ఆ దేశం నుంచి తరలించే అవకాశం ఉందని వార్తలు వ‌స్తున్నాయి. పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని ఆయ‌న పార్టీ మ‌ద్ద‌తుదారులు గత కొన్నిరోజులుగా భారీ ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌ను ముట్టడించడంతో పాకిస్థాన్ రాజధాని ప్రస్తుతం లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటోంది. 

ఈ ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో ఇటీవ‌ల ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. ప్ర‌స్తుతం ఈ నిర‌స‌న‌ల కార‌ణంగా పాక్ అట్టుడుకిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీలంక-ఏ జ‌ట్టు అర్ధాంత‌రంగా త‌మ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని పాక్ నుంచి వెళ్లిపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్చువల్ సమావేశానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

దాంతో శ్రీలంక బాట‌లోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనే మరికొన్నిదేశాలు భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేయడంతో ఈవెంట్‌ను పాకిస్థాన్ నుంచి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒత్తిడిలో ట్రోఫీని పీసీబీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి అంగీకరించే అవకాశం ఉందని ఐఏఎన్ఎస్ పేర్కొంది. 

  • Loading...

More Telugu News