shravan kumar: ఫోన్ ట్యాపింగ్ కేసు .. శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన ప్రభుత్వ న్యాయవాది
- న్యాయవాది సమక్షంలో విచారించడానికి మీకైమైనా అభ్యంతరమా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాంపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ 6వ నిందితుడుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ ఏ తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యాక, ఏ – 2 ప్రవీణ్‌రావు అరెస్టైన వెంటనే అర్ధారాత్రి విదేశాలకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాలో దాక్కున్నారని ఆరోపించారు. విచారణకు సహకరించడం లేదని ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు.
శ్రవణ్ కుమార్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అమెరికాలో అందుబాటులోనే ఉన్నారని, ఆయన ఈ మెయిల్, వాట్సాప్, సెల్ నెంబర్, ఆమెరికాలో ప్రస్తుత చిరునామా సహా వివరాలు కోర్టుకు అందించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. 'పిటిషనర్‌ను లొంగిపోవాలని ఆదేశిస్తాం.. పిటిషనర్‌ను తన న్యాయవాది ఆధ్వర్యంలో విచారించడానికి మీకేమైనా అభ్యంతరమా?' అని పీపీని ప్రశ్నించింది.
పోలీసుల నుంచి వివరణ తీసుకుని తెలియజేస్తానని పీపీ సమాధానం ఇవ్వడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. మరో వైపు ఇదే కేసులో భుజంగరావు మధ్యంతర బెయిల్‌ను డిసెంబర్ 4 వరకు హైకోర్టు పొడిగించింది.