rayalaseema thermal power plant: చంద్రబాబు చెంతకు బూడిద తరలింపు పంచాయితీ
- బూడిద తరలింపు వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్
- జేసీ, ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డిలకు సీఎంఓ నుంచి పిలుపు
- నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం
వైఎస్ఆర్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపు పంచాయితీ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు చెంతకు చేరింది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయుల మధ్య ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.
రెండు రోజులుగా ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కూటమి పార్టీ నేతల మధ్య నెలకొన్న రగడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు జమ్మలమడుగు ప్రాంతంలోని ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే విషయంపై జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది.
ఇది వరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా, రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. బూడిదను జేసీ వాహనాల్లో నింపకుండా ఆదినారాయణ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రికి రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డగించారు.
ఈ వివాదం నేపథ్యంలో ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని నేతలకు హెచ్చరించారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సరిహద్దుల వద్ద, ఆర్టీపీపీ వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ఆది, జేసి వర్గీయులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది.
ఆదినారాయణరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జి భూపేష్ రెడ్డిలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందింది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం (ఈరోజు) కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.