acb raid: ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి అరెస్టు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
- గొండు మురళి నివాసాల్లో ముగిసిన ఏసీబీ అధికారుల సోదాలు
- గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగిన సోదాలు
- సుమారు రూ.70 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల గుర్తింపు
మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏగా పని చేసిన గొండు మురళి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రి కృష్ణదాసు పీఏగా పని చేసిన సమయంలో భారీ మొత్తంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. అలాగే శ్రీకాకుళం, విశాఖలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కేజీల వెండి వస్తువులు తదితరాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఈ క్రమంలో గురువారం అర్ధ రాత్రి ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. సోదాల్లో ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఎస్ఐ భాస్కరరావు, విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులు పాల్గొన్నారు.