Shahid Afridi: పాక్ క్రికెట్ బోర్డుకు అఫ్రిది మద్దతు... బీసీసీఐపై ఆగ్రహం
- ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు పీసీబీ నిరాకరణ
- మొత్తం టోర్నీని పాక్ గడ్డపైనే నిర్వహించాని పట్టు
- నేటి సమావేశం తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
- క్రీడలు, రాజకీయాలను ఒక గాటన కట్టడమేంటని బీసీసీఐపై అఫ్రిది ఫైర్
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పీసీబీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్‌ను నిరాకరించిన పాక్ బోర్డుకు అండగా నిలిచిన అఫ్రిది బీసీసీఐపై విమర్శలు కురిపించాడు. రాజకీయాలు, క్రీడలను ఒకే గాటన కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ఐసీసీకి సూచించాడు. నేటి సమావేశంతో తర్వాత చాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు, ట్రోఫీకి భారత జట్టును పాకిస్థాన్‌కు పంపే ప్రశ్నే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైబ్రిడ్ మోడల్‌కు నిరాకరిస్తున్న పీసీబీ టోర్నీ మొత్తాన్ని పాక్ గడ్డపైనే నిర్వహించాలని పట్టుబడుతోంది.
ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్ జట్టు భారత్‌లో ఐదుసార్లు పర్యటించిన విషయాన్ని అఫ్రిది ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక వైట్ బాల్ సిరీస్ జరిగినట్టు కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఐసీసీ, దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.