KTR: రేవంత్ రెడ్డికి గ్రామాల్లోకి వెళ్లి ఏడాది పాలనపై తెలుసుకునే దమ్ముందా?: కేటీఆర్

KTR challenges Revanth Reddy

  • కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్న కేటీఆర్
  • కరీంనగర్ బీఆర్ఎస్ జన్మస్థలం.. పునర్జన్మను కూడా ఇచ్చిందన్న కేటీఆర్
  • ఉద్యమంలో లేని వాళ్లు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శ

తన ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి ప్రతి గ్రామానికి, బస్తీకి, తండాకు వెళ్లి తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అలా వెళ్లి తెలుసుకునే దమ్ముందా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. గురుకులాల్లోని విద్యార్థులు కూడా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పరిస్థితి ఇది అన్నారు. 

కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ జన్మస్థలమని, ఆ తర్వాత కూడా తమ పార్టీకి కరీంనగర్ పునర్జన్మ ఇచ్చిందన్నారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి... ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. 1969లో తెలంగాణ కోసం 370 మంది అమరులయ్యారని, వారి సాక్షిగా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మొదటిసారి ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు.

కేసీఆర్ పదవుల కోసం ఆశించకుండా తెలంగాణ కోసమే ఉద్యమించారన్నారు. కేసీఆర్ అనేది సాధారణ పేరు కాదని... తెలంగాణ పోరు అని అభివర్ణించారు. ఉద్యమంలో అడ్రస్ లేనివాళ్లు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారుల పైకి తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే అడుక్కుతినేవాళ్లమన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.

తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి పోరుబాట పట్టాల్సి వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి వద్ద ఇప్పుడు అధికారం ఉందని, కానీ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్, గులాబీ జెండాకే ఉందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయ పర్వతమంత ఎత్తులో ఉంటే కాంగ్రెస్ ఆయన కాలి గోటికి కూడా సరిపోదన్నారు.

  • Loading...

More Telugu News